Tuesday, September 7, 2010

No recomeondations only options: Duggal

(COURTESY: ANDHRAJYOTI)

సిఫార్సూ ఉండదు


మా నివేదికలో 'ఆప్షన్స్' మాత్రమే ఇస్తాం

అంతిమ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే

అందుకు అవసరమైన సమాచారమంతా ఉంటుంది

నివేదికను హోంశాఖకు సమర్పిస్తాం

అది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది

అంతర్యుద్ధం తలెత్తే పరిస్ధితి ఉండదు

తలెత్తితే చట్టమే చూసుకుంటుంది

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వూలో

శ్రీకృష్ణకమిటీ సభ్యకార్యదర్శి దుగ్గల్



న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6 : 'డిసెంబర్ 31' తర్వాత అంతర్యుద్ధం వచ్చే అవకాశమేదీ లేదని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్ స్పష్టం చేశారు. ఎవరూ తప్పు పట్టలేని, సహేతుకమైన, అత్యంత హేతుబద్ధమైన, ప్రయోజనకరమైన, విశ్వసనీయమైన నివేదిక అందిస్తామన్నారు. దీనిని చదివితే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుందని తెలిపారు.



అయినప్పటికీ... ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చట్టమే చూసుకుంటుందని ఆయన హెచ్చరించారు. సోమవారం దుగ్గల్ ఢిల్లీలో 'ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి' ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర విభజనపై 'ఫలానా' నిర్ణయం తీసుకోవాలని తాము నేరుగా చెప్పబోమన్నారు. అయితే... దీనిపై కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చేందుకు అవసరమైన అన్ని వివరాలు తమ నివేదికలో ఉంటాయన్నారు. "కమిటీ ప్రతి విషయాన్నీ గమనంలోకి తీసుకుంటుంది.



ప్రతి ప్రకటనను, ప్రతి సంఘటనను కూడా! నేను చెప్పేది మీకు అర్థమవుతోందా? అవి ఉప ఎన్నికల ఫలితాలు కావచ్చు, ఇక్కడా, అక్కడా జరుగుతున్న అనేక అం శాలపై జరుగుతున్న ఆందోళనలు కావచ్చు, ఉద్వేగాల వ్యక్తీకరణ కావచ్చు. కమిటీ ముందు చేసిన ప్రకటనలు కావచ్చు, ప్రతిదాన్నీ మేం గమనంలోకి తీసుకుంటాం. అయితే... చాలా నిష్ణాతులైన, నిష్పక్షపాతులైన, నిపుణులైన, అనుభవజ్ఞులైన వారితో కమిటీ ఏర్పడింది. మేం ఈ వైపున గానీ, ఆవైపున గానీ వచ్చే అంశాలు, ఇక్కడి లేదా అక్కడి ప్రజలు లేవనెత్తే విషయాల ప్రభావానికి లోనుకాం.



మా నివేదిక ఏది రాష్ట్ర ప్రజల అత్యుత్తమ ప్రయోజనాలను పరిరక్షిస్తుందో, ఏది పూర్తి తార్కికంగా ఉంటుందో ఏది పూర్తిగా వాంఛనీయమో, ఏది మొత్తం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తుందో అలా ఉంటుంది. దీని అర్థం... యాక్షన్ ఏ అయితే ఏ, యాక్షన్ బీ అయితే బీ. నేను మళ్లీ చెబుతున్నాను. తుది నిర్ణయం తీసుకునేది మాత్రం ప్రభుత్వమే. ఈ కమిటీకి అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం లేదు. మేం మొత్తం సహేతుకతను, ఆప్షన్స్‌ను మాత్రమే నివేదిస్తాం. కేంద్ర ప్రభుత్వానికి నిర్ణయం తీసుకోవడానికి సరిపడినంతా (సమాచారం) మా నివేదికలోఉంటుంది.



ఏ నిర్ణయం తీసుకోవాలో, అది వాళ్ల ఇష్టం.'' అని వివరించారు. అంతర్యుద్ధం, అలజడుల గురించి అడిగిన ప్రశ్నకు విస్పష్టమైన సమాధానం ఇచ్చారు. "ఈ దేశంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో తలెత్తాయి. ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనేందుకు ఉత్తమ మార్గం సంప్రదింపులే. అయినప్పటికీ అలజడి చెలరేగితే... దానిని అదుపు చేయడానికి బలమైన చట్టం ఉండనే ఉంది'' అని దుగ్గల్ తెలిపారు. డిసెంబర్ 31వ తేదీలోపే నివేదిక సమర్పిస్తామని... ఒక్క రోజు కూడా అదనంగా కోరేది లేదని దుగ్గల్ పునరుద్ఘాటించారు.



ఈ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెడతారా, ప్రజల ముందుకు తెస్తారా అనే ప్రశ్నను కేంద్ర హోంమంత్రినే అడగాలన్నారు. నివేదిక సమర్పించడం వరకే తమ బాధ్యత అని తెలిపారు. "కమిటీలో ఎలాంటి వారున్నారో మీకు తెలుసు! అనుభవజ్ఞులు, అవగాహన ఉన్నవారు, నిష్పాక్షికంగా వ్యవహరించే వారితో ఈ కమిటీ ఏర్పాటైంది. మేం ఎవరి వైపూ మొగ్గు చూపం. ఎవరి ఒత్తిళ్లకూ లొంగం'' అని ఆయన వివరించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చేదాకా ఏపీపీఎస్సీ వంటి నియామకాలేవీ జరగొద్దనే డిమాండ్లపై దుగ్గల్ స్పందించారు. "మా నివేదిక ఆలస్యమవుతుందని మేం ఎప్పుడూ చెప్పలేదు. అలాగే, నివేదిక ఇచ్చేదాకా ప్రస్తుత పాలనా విధానాలను నిలిపివేయాలని కూడా సిఫారసు చేయలేం. అయితే... ఏపీపీఎస్సీతో సహా జరుగుతున్న అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకుంటాం. విద్య, ఉద్యోగాల అంశంపై స్పందిస్తాం'' అని దుగ్గల్ వివరించారు.



ఎందుకు చెప్పారో గ్రహించగలం: 'మీరు నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలంటారు. సీమాంధ్ర వాసులు మాత్రం సమైక్యాంధ్రే ఉండాలంటారు. వీటిలో ఏది సరైన వాదనో ఎలా అంచనాకు వస్తారు?' అనే ప్రశ్నకు దుగ్గల్ సవివరమైన సమాధానం ఇచ్చారు. "కమిటీలో ఉన్న సభ్యులంతా అనుభవజ్ఞులు. జస్టిస్ శ్రీకృష్ణకు 70 సంవత్సరాలు, నాకు 65 ఏళ్లు. మా ముందు మాట్లాడే వారిని లాజికల్‌గా ప్రశ్నిస్తున్నాం. సాగునీరు, ఉద్యోగాలు, రిజర్వేషన్లు... వీటిపై మాట్లాడే వారికి నిజంగానే వారికి అవగాహన ఉందా? అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నారా? లేక... భావోద్వేగంతో మాత్రమే చెబుతున్నారు. అదీకాకపోతే, ఎవరైనా చెప్పమంటే ఇలా చెబుతున్నారా? అనే విషయాన్ని గ్రహించగలం'' అని దుగ్గల్ చెప్పారు.



అలాగే... క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలు తెలుసుకునేందుకే స్వయంగా మారుమూల గ్రామాలకు వెళ్తున్నామని తెలిపారు. "ఎక్కడో ఢిల్లీలో కూర్చుని, పది ముఖ్యమైన పార్టీలతో మాట్లాడితే సరిపోదు. ప్రజల మనోభావాలు, ప్రజానాడి తెలుసుకోవాలంటే నేరుగా ప్రజల్లోకి వెళ్లాలి'' అని దుగ్గల్ పేర్కొన్నారు. ఇప్పటికి తమ పని 95 శాతం వరకు పూర్తయిందని తెలిపారు. "సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలతో ఈనెల 9న సమావేశమవుతున్నాం. మరికొన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. ఈ నెల మూడో వారం నుంచి... మూడున్నర నెలలపాటు మా వద్దకు వచ్చిన మొత్తం సమాచారాన్ని, మేం గుర్తించిన విషయాలను విశ్లేషిస్తాం. నివేదికను సిద్ధం చేస్తాం'' అని తెలిపారు.

No comments: