ఎసి బస్సులోనే బాబు బస!( ఆంద్రభూమి దినపత్రిక నుంచి)
హిందూపురం,
అక్టోబర్ 4: వస్తున్నా మీకోసం అంటూ మహా పాదయాత్రకు అనంతపురం జిల్లా
హిందూపురం నుంచి అక్టోబర్ 2వ తేదీ శ్రీకారం చుట్టిన టిడిపి అధినేత
చంద్రబాబునాయుడు ఆరోగ్యం, భోజనం, విశ్రాంతి పట్ల ప్రత్యేక శ్రద్ధ
కనబరుస్తున్నారు. పాదయాత్రలో భాగంగా రాత్రిపూట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన
గుడారాల్లో నిద్రిస్తారని, అందరితోపాటే భోజనాలు చేస్తారని కార్యకర్తలు
ఆశించారు. అయితే బాబు మాత్రం రాత్రిపూట అన్ని హంగులతో తీర్చిదిద్దిన హైటెక్
ఎసి బస్సులో నిద్రిస్తున్నారు. దీనికి తోడు మధ్యాహ్నం, రాత్రి పూట భోజనాలు
ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఏసి మినీ బస్సులో చేస్తున్నారు. రాత్రిపూట
పాదయాత్ర ముగియగానే అప్పటికే అక్కడికి చేరుకున్న ఎసి బస్సులోకి బాబు
చేరుకుంటున్నారు. మరుసటి రోజు పాదయాత్ర ప్రారంభమయ్యేదాకా ఆయన బస్సు దిగడం
లేదు. ఉదయం నిద్రలేవగానే అందులోనే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మరుగుదొడ్డిలో
కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. అనంతరం కొద్దిసేపు యోగా చేసి స్నానాదులు
పూర్తయిన తరువాత పూజ చేస్తున్నారు. అనంతరం అల్పాహారం తీసుకుంటున్నారు.
పాదయాత్ర ప్రారంభానికి ముందు దాదాపు అరగంట పాటు జిల్లా టిడిపి నేతలతో
అంతర్గత చర్చలు జరుపుతున్నారు. అనంతరం బయటకు వచ్చి పాదయాత్రకు శ్రీకారం
చుడుతున్నారు. గత మూడు రోజులుగా బాబు దినచర ఈ విధంగా కొనసాగుతోంది. మొదటి
రెండు రోజులు రాత్రిపూట పాదయాత్ర ముగిసేటప్పడికి అర్ధరాత్రి దాటడంతో ఉదయం
ఆలస్యంగా పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు శ్రీకారం చుట్టిన బాబు ప్రత్యేక
ఆహార నియమాలు పాటిస్తున్నారు. వంటకోసం వ్యక్తిగత వంటమనిషి, సిబ్బంది
ప్రత్యేక వాహనంలో పాదయాత్రను అనుసరిస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు
చంద్రబాబుకు అవసరమైన కాఫీ, టీ, పండ్లరసాలు, అల్పాహారం, భోజనం, రొట్టెలు
తయారు చేస్తున్నారు. మధ్యాహ్నం అందులోనే. మధ్యాహ్నం సులభంగా జీర్ణమయ్యే
పదార్థాలు రాత్రిపూట ఉప్మా, పొంగలి, పండ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వంట
మనిషి సుధాకర్ ముందుగా ఇచ్చే మెనూ మేరకు ఆహార పదార్థాలు సిద్ధం
చేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు బీట్‌రూట్ రసం, కీర రసం తదితర
పండ్ల రసాలు తాగుతున్నారు. గురువారం మధ్యాహ్నం చంద్రబాబు నాయకులతో కలిసి
టెంట్‌లో భోజనాలు చేస్తారని భావించారు. పెనుకొండ దర్గా సర్కిల్‌లో మినీ
బస్సులోకి ఆయన ఒక్కరే వెళ్ళి భోజనం చేసి బయటకు వచ్చారు. గత రెండు రోజులుగా
మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో బాబు భోజనం చేయగా రాత్రి వేళల్లో పాదయాత్ర
ముగిసిన తర్వాత భోజనం చేస్తున్నారు.
No comments:
Post a Comment