Tuesday, September 10, 2013

Eduru tirige gatti pindam


(from SAKSHI DAILY PAPER)

ఎదురుతిరిగే గట్టి పిండం!

ఎదురుతిరిగే గట్టి పిండం!
ఈ లోకంలోకి రావలసిన చిన్నారి అయితే బుద్ధిగా తలను ముందుగా ఈ లోకంలోకి తీసుకురావాలి. కానీ కొన్ని గట్టిపిండాలు కాస్త ఎదురుతిరుగుతాయి. లోకంలోకి బుద్ధిమంతుడిలా రావాల్సిన వాడు అలా రానంటూ మొండికేస్తే...? తల ముందుకు రావలసినచోట అడ్డం తిరిగి కాళ్లు ముందు పెడితే...?  ప్రసవవేళకు  పిండం ఇలా అడ్డం తిరగడాన్నే ‘బ్రీచ్’ బేబీ అంటారు. చిన్నారులు కాస్తా బ్రీచ్ బేబీస్‌గా మారిన సందర్భాల్లో వారిని ఈ లోకంలోకి తీసుకురావడానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ  ఇలాంటి సందర్భాల్లోనూ శస్త్రచికిత్సకు బదులుగా ప్రత్యామ్నాయం ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి ప్రత్యామ్నాయాలు ఏమిటి? బ్రీచ్ బేబీస్ ఉన్నప్పుడు ఏ సందర్భంలో శస్త్రచికిత్స తప్పనిసరి అవుతుంది... లాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం...

అప్పటివరకూ గర్భసంచిలో తేలియాడుతూ గిరగిర తిరిగే చిన్నారి ప్రసవం వేళకు తలను బయటపెడుతూ ఈ ప్రపంచంలోకి రావాలి. అలా శిరస్సు ముందుగా కనిపించడాన్ని ‘శీర్షోదయం’ అని మనవాళ్లు సాంప్రదాయికంగా అంటారు. కానీ శీర్షోదయం కాకుండా బిడ్డ అడ్డం తిరిగే కండిషన్స్ దాదాపు 3 శాతం నుంచి 4 శాతం సందర్భాల్లో కలుగుతుంటాయి. ఈ కండిషన్ వల్ల గతంలో దాదాపు 25 శాతం శిశుమరణాలు జరుగుతుండేవి. కానీ ఇటీవల ఆసుపత్రుల్లో ప్రసవం జరిగేలా ప్లాన్ చేసుకునే ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్ కారణంగా ఈ కేసులు చాలావరకు తగ్గాయి.

 బిడ్డ అడ్డం తిరగడానికి కారణాలు

 బిడ్డ సరిగా ఎదగకపోవడం (ప్రీమెచ్యురిటీ)
పుట్టుకతోనే శిశువులో ఏర్పడే లోపాలు (కంజెనిటల్ అబ్‌నార్మాలిటీస్)  పుట్టకముందు గర్భసంచిలోని కొన్ని పొరల్లో చిరుగులు ఏర్పడటం (ప్రీటర్మ్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్)  బిడ్డను అంటిపెట్టుకుని ఉండే మాయ గర్భసంచిలోకి లేదా గర్భాశయ ముఖద్వారంలోకి ప్రవేశించడం (ప్లాసెంటా ప్రివియా), బిడ్డ ప్రసవం కావడానికి మాయ అడ్డుపడటం (ప్లాసెంటల్ అబ్ప్ష్రన్)... వంటి సందర్భాల్లో బిడ్డ ప్రసవానికి ఆటంకం కలుగుతుంది. కొన్నిసార్లు బొడ్డు తాడే శిశువు తలకు అడ్డు పడుతుంటుంది. ఈ కండిషన్‌ను అంబలికల్ కార్డ్ ప్రొలాప్స్ అంటారు. ఇలాంటప్పుడు అత్యవసరంగా శస్త్రచికిత్స ద్వారా శిశువును బయటకు తీయాల్సి వస్తుంది.

సహజ ప్రసవానికి ప్రతిబంధకంగా మారే కండిషన్స్
ప్రసవం వేళకు బిడ్డ పూర్తిగా ఎదగకపోవడం (ప్రీ- మెచ్యూరిటీ)  ఒక అండం కాకుండా అనేక అండాల ఫలదీకరణ (మల్టీఫీటల్ జెస్టేషన్.. సాధారణంగా ఇలాంటి కండిషన్‌లోనే కవలలు... మూడు లేదా నాలుగు గర్భస్థ శిశువులు కడుపులో పెరగడం వంటివి సంభవిస్తాయి).

బిడ్డ తలలో నీరు ఉండటం (హైడ్రోసెఫాలస్), బిడ్డ మెదడు ఎదగాల్సినచోట అది లోపించి, మెదడులోని అనేక భాగాలు ఎదగకపోవడం (అనెన్‌సెఫాలస్).  కడుపులో బిడ్డకు పిండదశలోనే అనేక లోపాలు ఏర్పడటం.  బిడ్డ వరసగా మూడుసార్ల కంటే ఎక్కువగా ఎదురుకాళ్లతో పుట్టిన కండిషన్స్ ఉన్న తల్లికి సాధారణంగా మరోసారి కూడా ఇలాంటి కండిషన్ ఏర్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్నే వైద్యపరిభాషలో మల్టీపారా విత్ లాక్స్ అబ్డామిన్‌గా వ్యహరిస్తుంటారు.

ఎక్స్‌టర్నల్ సెఫాలిక్ వర్షన్ (ఈసీవీ) - ఒక అద్భుత ప్రత్యామ్నాయం
 బిడ్డ కడుపులోంచి బయటికి రావడానికి అనువైన రీతిలో అంటే ముందుగా తల బయటపెట్టి రాకుండా ఇతరత్రా పొజిషన్స్‌లో ఉన్నప్పుడు నేరుగా శస్త్రచికిత్సతో బిడ్డను బయటకు తీసుకురావడానికి బదులుగా మొదటినుంచే కాస్తంత ప్రయత్నించి బిడ్డ పొజిషన్‌ను తల ముందుకు తీసుకొచ్చేలా చేయడాన్ని ‘ఎక్స్‌టర్నల్ సెఫాలిక్ వర్షన్-ఈసీవీ’ అంటారు. సాధారణంగా కడుపులోని బిడ్డ ఎప్పుడూ గర్భసంచిలోని ఉమ్మనీటిలో దొర్లినట్లుగా అటూయిటూ తిరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. గర్భసంచిలో బిడ్డ ఎదుగుతున్నకొద్దీ బిడ్డ పరిమాణం పెరుగుతూ, అది తిరగడానికి వీలుకల్పించే ఉమ్మనీటి ద్రవం తగ్గుతూ పోతుంటుంది. అయితే ప్రసవం సమయానికి బిడ్డ తల ఆటోమేటిగ్గా బయటకు రావడానికి వీలుగా కిందివైపు తిరుగుతుంది. కొందరిలో ఇలా తిరగకపోతే తల్లి కడుపుపై చేతులుంచి బయటినుంచే లోపలి పిండాన్ని తిరిగేలా చేస్తూ తలను కిందివైపునకు తిరిగేలా చేసే ప్రక్రియను ఎక్స్‌టర్నల్ సెఫాలిక్ వర్షన్ (ఈసీవీ) అంటారు. అయితే ఈసీవీ  అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. అది సాధ్యం కాని సందర్భాలివి...

బిడ్డను అంటిపెట్టుకుని ఉండే మాయ గర్భసంచిలోకి లేదా గర్భాశయ ముఖద్వారంలోకి ప్రవేశించడం (ప్లాసెంటా ప్రివియా)  ప్రసవం అయ్యేటప్పుడు జరిగే అద్భుతమైన విన్యాసం ఏమిటంటే అంతటి బిడ్డ పంజరంలా ఉండే మహిళల కటి ఎముకల(పెల్విస్) మధ్యనుంచి బయటకు వస్తాడు. ఆ కటి ఎముకల పరిమాణం బిడ్డ అందులోంచి బయటకు రావడానిక వీల్లేనంత చిన్నగా ఉండి, బిడ్డ ఇరుక్కుపోయే పరిస్థితి ఉంటే కూడా ఈసీవీ సాధ్యం కాదు.   బిడ్డ గర్భసంచిలో ఉన్నప్పుడు అందులోని కొన్ని పొరలు చిరిగినప్పుడు (రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్) కూడా ఈసీవీ సాధ్యం కాదు.

ఆలిగో హైడ్రోమ్నియాసిస్ : గర్భసంచిలో ఉండాల్సినంత ఉమ్మనీరు లేకుండా పూర్తిగా తగ్గిపోయే కండిషన్‌ను ఆలిగో హైడ్రోమ్నియాసిస్ అంటారు. ఇలా బిడ్డ తిరగడానికి లోపల ద్రవం లేని సందర్భాల్లో బిడ్డను గర్భసంచిలో కిందికి తిరిగేలా చేయడం కష్టం కదా. అందుకే ఈసీవీ సాధ్యంకాదన్నమాట.

ఇరిటబుల్ యుటెరస్ : గర్భసంచిలో బిడ్డ తిరిగే ప్రక్రియ చాలా బాధాకరంగా, తీవ్రమైన నొప్పితో ఉన్నప్పుడూ ఈసీవీ సాధ్యం కాదు.

మల్టీఫీటల్ ప్రెగ్నెన్సీ: పిండదశలో ఒకటి కంటే ఎక్కువ ఫలదీకరణలు జరిగి లోపల ఒకటి కంటే ఎక్కువ పిండాలు అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు (ట్రిప్లెట్స్), నలుగురు లేదా అంతకంటే ఎక్కువగా బిడ్డలు పెరుగుతున్నప్పుడు కూడా ఈసీవీ జరపడం కుదరదు.

యాంటీరియర్ ప్లాసెంటా: బిడ్డకు ఉండే మాయ ఉండే పొజిషన్స్‌లోనూ మార్పులుంటాయి. వీటిలో మాయ పైభాగంలో ఉండేలా జరిగే గర్భధారణ (యాంటీరియర్ ప్లాసెంటా) కండిషన్ కూడా ఈసీవీ జరపడానికి అడ్డంకి అవుతుంది.

హిస్టరీ ఆఫ్ ఆర్‌హెచ్ కంపాటబిలిటీ: బిడ్డ బ్లడ్ గ్రూపుల్లో తేడా ఉండేలా పిండదశలోనే వచ్చే రీసస్ ఇన్‌కంపాటబిలిటీ డిసీజ్ లేదా రీసస్ హిమోలిటిక్ డిసీజ్ ఉన్న సందర్భాల్లోనూ కుదరదు.

సివియర్ ఇంట్రాయుటెరైన్ గ్రోత్ రిటార్డేషన్: బిడ్డ గర్భసంచిలో ఎంతగా ఎదగాలో అంతగా ఎదగకుండా... ఎదుగుదల లోపించిన సందర్భాల్లోనూ ఈసీవీ సాధ్యం కాదు.

ఫీటస్ విత్ హైపర్ ఎక్స్‌టెండెట్ లేదా ‘స్టార్ గేజింగ్’ హెడ్ : మనం ఆకాశంలో నక్షత్రాలను చూసినట్లుగా ఉన్నప్పుడు తల ఎలా ఎత్తుతామో గుర్తించండి. ప్రసవమయ్యే సమయంలోనూ బిడ్డ తల ఆ విధంగా పెకైత్తినట్లుగా పెట్టి ఉంచినప్పుడు కూడా ఈసీవీ చేయడం కుదరని పని.

ఇంట్రాయుటెరైన్ ఫీటల్ డెత్: దురదృష్టవశాత్తూ కొన్ని సందర్భాల్లో కడుపులోనే బిడ్డ మరణించవచ్చు. ఇలా కడుపులో మృతశిశువు ఉన్న సందర్భంలోనూ ఈసీవీ చేయడం కుదరదు.

హైడ్రోసెఫాలస్ / అనెన్‌సెఫాలీ వంటి పుట్టుకతో ఉండే లోపాలు ఉన్న సందర్భాల్లో: కొందరు బిడ్డల్లో మెదడు ఎదగాల్సినచోట కేవలం నీరు మాత్రమే ఉంటుంది. ఇక మరికొందరు బిడ్డల్లో మెదడులోని అన్ని భాగాలూ పూర్తిగా ఎదగకుండా ఉండిపోతాయని తెలుసుకున్నాం. ఈ కండిషన్స్‌ను వరసగా హైడ్రోసెఫాలస్, అనెన్‌సెఫాలీ కండిషన్స్ అంటారు. ఇలాంటి సందర్భాల్లోనూ ఈసీవీ చేయడం సాధ్యం కాదు.

ఈసీవీ చేయించుకోవాలని కోరేవారు అన్ని వసతులు ఉండే మంచి ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకుని అక్కడ అనుభవజ్ఞులైన ‘ఆబ్‌స్ట్రట్రీషియన్’ (గర్భస్థ పిండ వైద్యచికిత్స, ప్రసూతినిపుణులు) ఉన్నారేమో చూడాలి. అక్కడ ఈసీవీ జరుగుతున్నప్పుడు కడుపులోని బిడ్డను కంప్యూటర్ తెరపై ఎప్పుడూ చూసేందుకు వీలయ్యేలా ‘రియల్‌టైమ్ అల్ట్రాసౌండ్ డాప్లర్’ సౌకర్యం ఉండాలి. ఈ డాప్లర్ ఉండటం వల్ల ఈసీవీ చేస్తున్నప్పుడు బిడ్డ తాలూకు బొడ్డు తాడు అతడి మెడకు బిగుసుకుపోతుందా లేక మామూలుగానే ఉందా అని ఎప్పటికప్పుడు పరిశీలనగా చూడటానికి వీలవుతుంది.

ఇలా చేస్తున్నప్పుడు ఒకవేళ తల్లికి తీవ్రమైన నొప్పి కలుగుతున్నా లేదా బిడ్డ తాలూకు గుండె స్పందనలు తగ్గుతున్నా లేదా ఈ గుండె స్పందనల్లోని లయ క్రమబద్ధంగా లేకపోయినా ఈ ప్రక్రియను నిలిపివేయాలి. ఈ ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ వీలుకాకపోతే అప్పుడు శస్త్రచికిత్స (సిజేరియన్ సెక్షన్) ను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. గర్భవతులు తమ భర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి బ్రీచ్ బేబీ ఉన్నప్పుడు తమకు శస్త్రచికిత్స ఇష్టం లేకపోతే ఇక ఈసీవీను కోరవచ్చు.

ప్రకృతిపరంగా జరగాల్సిన ప్రసవం సాధ్యం కానప్పుడు మాత్రమే శస్త్రచికిత్సకు వెళ్లాలన్న అంశాన్ని అందరూ గుర్తుపెట్టుకుంటే అది కాబోయే తల్లికీ, సమాజానికీ మేలు చేసే అంశం.
                                                      
 -నిర్వహణ: యాసీన్

బ్రీచ్ బేబీస్‌కు శస్త్రచికిత్సే మార్గమా?

కడుపులోని బిడ్డ ఎదురుకాళ్లతో ఉండి ఈ లోకంలోకి రావడానికి మారాం చేస్తుంటే, సహజ ప్రసూతికి అవకాశమే లేదా! శస్త్రచికిత్స చేయించాల్సిందేనా! అని కొందరిలో సందేహం ఉండవచ్చు. దీనికి ప్రత్యామ్నాయం ఉంది. ఈ ప్రక్రియను ఎక్స్‌టర్నల్ సెఫాలిక్ వర్షన్-(ఈసీవీ) అంటారు . శస్త్రచికిత్సను ఇష్టపడనివారు ఈ ప్రత్యామ్నాయ మార్గం కోసం డాక్టర్‌ను సంప్రదించవచ్చు. అయితే దీనికీ కొన్ని పరిమితులున్నాయని గుర్తుంచుకోండి.

బిడ్డ అడ్డం తిరగడంలో రకాలు
కడుపులో బిడ్డ ప్రసవ సమయంలో కేవలం ఎదురుకాళ్లతోనే గాక అనేక రకాలుగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. దీన్నే మనం బిడ్డ అడ్డం తిరగడంలో రకాలుగా పేర్కొనవచ్చు. అవి...

ఫ్రాంక్ / ఇన్‌కంప్లీట్ బ్రీచ్ : ఇందులో బిడ్డ తలకు బదులుగా పిరుదులను తొలుత బయటకు తేవడానికి ప్రయత్నిస్తుమంటుంది. ఇలాంటి పొజిషన్‌లో బిడ్డ ఒక పాదం  చెవుల దగ్గర ఉంటుంది.

కంప్లీట్ బ్రీచ్ / ఫ్లెక్సెడ్ బ్రీచ్ : ఇందులోనూ బిడ్డ తలకు బదులుగా పిరుదులను తొలుత బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ పొజిషన్‌లో బిడ్డ రెండు పాదాలూ ముడుచుకుని ఉంటాయి.

పూట్లింగ్ ప్రజెంటేషన్: ఈ కండిషన్‌లో బిడ్డ పిరుదులు, మోకాళ్లు రెండూ ముడుచుకుని ఉంటాయి. లేదా ఒక కాలు పూర్తిగా చాపి ఉంటుంది. అయితే పాదాలు పిరుదుల కంటే కింది భాగంలో ఉండి ప్రసవం కష్టమవుతుంది.