Wednesday, April 5, 2017

Vijayawada air passenger statatics

  • అత్యధికంగా 32 విమాన సర్వీసులు గగనతలంలోకి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
అమరావతి రాజధాని ప్రాంతంలో తలమానికంగా ఉన్న విజయవాడ ఎయిర్‌పోర్టు ఈ ఏడాది మరో చరిత్రనే సృష్టించింది. దేశంలోనే అత్యధిక వృద్ధి సాధించిన ఎయిర్‌పోర్టులలో విజయవాడ సరికొత్త చరిత్రను సృష్టించింది. అర్థ సంవత్సర ఫలితాల్లోనే దేశంలోని మెట్రోపాలిటన్ ఎయిర్‌పోర్టులన్నింటినీ పక్కన పెట్టి అగ్రపథంలోకి దూసుకువెళ్లిన విజయవాడ ఎయిర్‌పోర్టు.... 2016-17 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 61 శాతం వృద్ధిని సాధించింది. అంతర్గత సమస్యలతో ఎయిర్‌కోస్తా, స్పైస్‌ జెట్‌ ఎయిర్‌లైన్స సంస్థలు విమాన సర్వీసులను కొన్నింటిని రద్దు చేసుకోవటం వల్ల కిందటేడాది సాధించిన 73 శాతం వృద్ధిని అందుకోలేనప్పటికీ, ప్రయాణికులపరంగా, మొత్తం విమాన రాకపోకల పరంగా, ఫ్లైట్స్‌ మూవ్‌మెంట్‌ ప్రకారం చూసినా 2015 - 16 ఆర్థిక సంవత్సరం కంటే అనూహ్యంగా ఎగబాకటం విశేషం. మూడు నెలల కాలంలో ఎయిర్‌కోస్తా , స్పైస్‌ జెట్‌ సంస్థల తీరు వల్ల 80 శాతం ఆక్యుపెన్సీని చేరుకోలేక పోయినా.. 10 లక్షల ప్రయాణికులను చేరవేసే ఎయిర్‌పోర్టులన్నింటికెల్లా విజయవాడ ఎయిర్‌పోర్టు అగ్రస్థానంలో ఉండటం విశేషం. రాజధాని నిర్మాణ పనులు ఊపందుకోవటం, ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఏర్పాటు కావటం, పలు పరిశ్రమలు ఇటు తరలి రావటం, అన్నింటికంటే ముఖ్యంగా రాజధానిలో పెట్టుబడులు పెట్టేవారు రాకపోకలు సాగించటం వల్ల విజయవాడ ఎయిర్‌పోర్టు దినదినాభివృద్ధి చెందుతోంది. విమాన సర్వీసులు భారీగా పెరగటం, ఆధునిక, సాంకేతికంగా అభివృద్ధి చెందటం, మౌలిక సదుపాయాలు విస్తరించటం వల్ల అంతకంతకూ డిమాండ్‌ పెరుగుతోంది. విజయవాడ విమానాశ్రయం నుంచి 2016 - 17 ఆర్థిక సంవత్సరంలో పలు విమానయాన సంస్థలు గరిష్టంగా తమ విమానాలను నడిపాయి. 2014- 15లో మొత్తం 14 విమానాలు వచ్చి వెళ్ళేవి. 2015 - 16 లో 21 విమానాలు వచ్చి వెళ్ళగా.. 2016 - 17 లో మాత్రం అత్యధికంగా 32 విమానాలు వచ్చి వెళ్లాయి. ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌ఇండియా, స్పైస్‌జెట్‌, ట్రూజెట్‌ సంస్థలు ఢిల్లీ, విశాఖపట్నం, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, వారణాసి, తిరుపతి, కడపలకు విమానాలు నడుపుతున్నాయి. అమరావతి రాజధానిగా అవిర్భవించిన తర్వాత కీలకమైన 2016 - 17 లో విజయవాడ విమానాశ్రయానికి వచ్చిన వారే అధికంగా నమోదయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు వచ్చిన వారు 3.28,988 మంది ఉన్నారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వారిలో 2,98,067 మంది ఉన్నారు. వీరు కాకుండా ట్రాన్సిట్‌ పాసెంజర్లు 23,208 వరకు ఉన్నారు.
మిలియన్ ప్రయాణికులు లక్ష్యం
ఆర్థిక సంవత్సరాంతానికి ఏడు లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తారని భావించాం. 6.50 లక్షల మంది ప్రయాణించారు. మూడు నెలల్లో ఎయిర్‌కోస్తా, స్పైస్‌ జెట్‌ వంటి సంస్థలు వారి అంతర్గత సమస్యల కారణంగా పలు విమానాలను నిలుపుదల చేయటం వల్ల కొంత నిరాశను కలిగించింది. కిందటి సంవత్సరం కంటే విమానాల సంఖ్య, మొత్తం విమానాల రాకపోకలు, మొత్తం ప్రయాణికుల విషయంలో చాలా పురోగతి ఉంది. 2017 - 18 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఒక మిలియన్ ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తారని కచ్చితంగా చెప్పగలను. మరిన్ని విమానయాన సంస్థలు ఇక్కడి నుంచి తమ ఆపరేషన్స ప్రారంభించనున్నాయి. రికార్డు స్థాయిలో విమాన రాక, పోకలువిజయవాడ ఎయిర్‌పోర్టుకు ఈ ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో విమానాలు రాకపోకలు సాగించాయి. సంవత్సరం అంతా చూస్తే ల్యాండింగ్‌ , టేకాఫ్‌ అయిన విమానాల లెక్కలు తీస్తే విజయవాడ కు విమానాల టేకాఫ్‌, ల్యాండింగ్‌ కలిపి మొత్తం 11,631 రాకపోకలు జరిగాయి. అదే 2015 - 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చూస్తే ల్యాండింగ్‌, టేకాఫ్‌ కలిపి 7,710 మేర రాకపోకలు సాగించాయి. ఏడాది మొత్తం విమానాల రాకపోకలలో ఈ ఏడాది 51 శాతం వృద్ధిని సాధించటం గమనార్హం. గత దశాబ్ద కాలం లెక్కలు తీస్తే 2013 - 14 లో 19 , 2014 - 15 లో 14 , 2015 - 16 లో 43 , 2016 - 17లో 51 శాతం వృద్ధిని సాధించటం గమనార్హం. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో ప్రయాణికులు, వృద్ధి రేటు విజయవాడ విమానాశ్రయం నుంచి 2016 - 17 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. ఆర్థిక సంవత్సరాంతానికి మొత్తం 6, 50, 463 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. అదే కిందటి ఆర్థిక సంవత్సరం 2015 - 16లో 4, 04, 464 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. ఈ ఏడాది ప్రయాణీకుల రాక, పోకల ఆధారంగా 61 శాతం వృద్ధి కనిపించటం విశేషం. గత అర దశాబ్ద గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే 2012- 13 ఆర్థిక సంవత్సరంలో 8 , 2013 - 14 లో 15 , 2014 - 15 లో 19 , 2015 - 16 లో 73 , 2016 - 17 లో 61 మేర వృద్ధిని సాధించటం గమనార్హం.