భారత
రక్షణ రంగంలో మరపురాని విజయమిది. భారతీయుడిగా ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ
క్షణమిది.. అగ్రరాజ్యాలు చిన్నచూపు చూసినా.. స్వశక్తితో సిద్ధం చేసుకున్న
అగ్ని -5 ఖండాంతర క్షిపణి తొలి ప్రయోగం విజయవంతమైంది. దీని ఉద్దేశం ఇతరులపై
దాడి చేయడం కాకపోయినా... ఇతరులు దండెత్తకుండా నిరోధానికి ఇది నిజంగా
ఆగ్నేయాస్త్రమే! భారత్ సాధించిన ఈ తాజా ఘన విజయం... వివరాలు.. విశేషాలు...
వినూత్న టెక్నాలజీతో పరిధి 40 శాతం పెంపు!
అగ్రరాజ్యాల
టెక్నాలజీ నిషేధాలను తోసిరాజంటూ భారత్ క్షిపణి వ్యవస్థల అభివృద్ధిలో
విజయాలు సాధిస్తోంది. 2008లో భారతీయ శాస్త్రవేత్తలు చేసిన ఓ ప్రకటన దీనికి
తార్కాణం. క్షిపణలు, ఉపగ్రహాలను మోసుకెళ్లే రాకెట్ల పరిధిని పెంచేందుకు
తాము ఓ వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేశామన్నది దాని సారాంశం.
రాకెట్‌పైభాగంలో ఉపగ్రహ/క్షిపణి ఉన్న భాగంపైన క్రోమియంతో చేసిన ఓ ప్రత్యేక
పదార్థాన్ని పూతగా పూయడం వల్ల ఇది సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు
ప్రకటించారు.
అత్యధిక
వేడిమి, వేగంతో దూసుకెళ్లేటప్పుడు ఈ పదార్థం ఆవిరై ఆ ప్రాంతం చుట్టూ ఓ
పలుచటి వాయు పొరను ఏర్పాటు చేస్తుంది. ఫలితంగా ఉపగ్రహం/క్షిపణికి ఎదురయ్యే
గాలి నిరోధం 47 శాతం వరకూ తగ్గుతుంది. ఈ టెక్నాలజీ ద్వారా ఒక్కో క్షిపణి
పరిధి కనీసం 40 శాతం పెరగుతుందని అంచనా. అంటే అగ్ని -5 ప్రస్తుత పరిధి
5,000 కిలోమీటర్లు ఉంటే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే 7,000 కిలోమీటర్లకు
పెంచుకోవచ్చునన్నమాట.
మొబైల్ లాంఛర్:
ఖండాంతర
క్షిపణులను ప్రయోగించేందుకు సాధారణంగా రెయిల్ లాంచర్ వ్యవస్థలను వాడతారు.
అగ్రరాజ్యాలు మాత్రం మొబైల్ లాంఛర్లు ఉపయోగిస్తాయి. భారత్ అగ్ని -5 కోసం
తొలిసారి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న కానిస్టర్
(గొట్టంలాంటి నిర్మాణం)ను ఉపయోగిస్తోంది. దృఢమైన ఉక్కు సమ్మేళనాలతో తయారైన ఈ
కానిస్టర్ లోపల గాలి చొరబడకుండా సీల్ చేస్తారు.
కొన్నేళ్లపాటు
క్షిపణిణి సురక్షితంగా ఉంచేందుకు ఇది అవసరం. ప్రయోగ సమయంలో వెలువడే 300
నుంచి 400 టన్నుల చోదకశక్తిని తట్టుకునేలా రూపొందించారు. మొబైల్ లాంఛర్
వ్యవస్థ ఉండటం వల్ల అగ్ని -5ను అవసరమైన చోటికి రోడ్డుపైనైనా సులువుగా
తరలించవచ్చు. అక్కడికక్కడే ప్రయోగించవచ్చు కూడా.
అగ్ని పుత్రి... టెస్సీ థామస్
అగ్ని
శ్రేణి విజయం వెనుక భారత శాస్త్రవేత్తల కృషి ఎంతన్నది ప్రపంచం మొత్తానికి
తెలిసినా.. ఈ అద్భుతం వెనుక ఉన్న మరో కీలక వ్యక్తి టెస్సీ థామస్. రక్షణ
రంగంలో పురుషాధిక్యతను తోసిరాజని అగ్ని-5 ప్రాజెక్ట్ డెరైక్టర్ స్థాయికి
ఎదిగిన టెస్సీ ‘అగ్ని పుత్రి’గా చరిత్ర సృష్టించారు. కేరళలోని అలెప్పీలో
జన్మించిన టెస్సీ తిషూర్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పట్టా పొందారు.
పుణేలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీలో గెడైడ్ మిసైల్ విభాగంలో
ఎంటెక్ చదివారు.
రాడార్లు, క్షిపణులపై చిన్నప్పటి నుంచి
పెంచుకున్న మక్కువను తీర్చుకునేందుకు 1988లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్
డెవలప్‌మెంట్‌లో చేరేలా చేసింది. అగ్ని - 3కి అసోసియేట్ ప్రాజెక్ట్
డెరైక్టర్‌గా పనిచేసిన టెస్సీ ఆ తరువాత అగ్ని -4 ప్రాజెక్టులోనూ ప్రాజెక్ట్
డెరైక్టర్ హోదాలో పనిచేశారు. 400 మంది శాస్త్రవేత్తలున్న అగ్ని-5లో
పనిచేస్తున్న మహిళగా మీకేమీ ఇబ్బందిగా ఉండదా? అని ప్రశ్నిస్తే...‘‘
శాస్త్రవేత్తలకు లింగభేదాలు ఉండవు. అలా ఉంటేనే కొత్త విషయాలు నేర్చుకోగలం..
ముందుకెళ్లగలం’’ అంటారు.
టెస్సీ... తన వృత్తికి ఎంతగా కట్టుబడి
ఉంటారంటే... 2006లో అగ్ని-4 క్షిపణి ప్రయోగానికి హాజరయ్యేందుకు జబ్బుపడ్డ
తన కుమారుడి తేజస్‌ని ఇంట్లోనే వదిలి వచ్చేశారు. ఇందుకు తేజస్ కూడా పెద్దగా
బాధపడలేదట. ‘‘అమ్మ దేశానికి సేవ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి తప్పవు.
నాకు అవసరమైన పలు సందర్భాల్లో అమ్మ నాకు అందుబాటులోనే ఉంది’’ అంటారు.
టెస్సీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీలో
పనిచేస్తున్నారు.
ఆరవ తరం అగ్ని వస్తోందా?
అగ్ని -5 క్షిపణి ప్రయోగం విజయవంతం కాకముందే తరువాతి తరం అగ్ని - 6
క్షిపణి తయారీకి భారత్ ఏర్పాట్లు చేస్తోందని వార్తలొస్తున్నాయి.
జలాంతర్గాముల నుంచి, నేలపై నుంచి కూడా ప్రయోగించగల సామర్థ్యమున్న అగ్ని -6
పరిధి ఆరు వేల నుంచి పదివేల కిలోమీటర్లు ఉంటుందని అంచనా. భారత్‌కు ఈ స్థాయి
క్షిపణి తయారీ ఆలోచన 2009 వరకూ లేదని, గత ఏడాదే దీనిపై నిర్ణయం జరిగిందని
తెలుస్తోంది. ‘సూర్య’ అన్న సంకేత నామంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కేంద్రం
కూడా ఆమోదం కూడా తెలిపినట్లు గత ఏడాది వార్తలొచ్చాయి.
ఒక్క క్షిపణి.. పది లక్ష్యాలు:
అగ్ని -5కున్న మరో ప్రత్యేకత ఇది. ఒక క్షిపణి... ఒక లక్ష్యం అని కాకుండా
ఒకే క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగపడే ఏర్పాటిది. వెయ్యి
కిలోల బరువున్న అణు క్షిపణి లేదంటే అంతే బరువుండే మూడు నుంచి పది చిన్న
సైజు క్షిపణులను ఏర్పాటు చేసుకోవచ్చు. శత్రు స్థావరాలు వందల కిలోమీటర్ల
ఎడంగా ఉన్నప్పటికీ ఈ చిన్న క్షిపణులు ఒకేసారి వాటిని ఢీకొట్టగలవు. లేదంటే
రెండు మూడు చిన్న క్షిపణులను ఒకే లక్ష్యంపై వరుసగా ఢీకొట్టేలా చేయవచ్చు.
చైనా అధిపత్యానికి చెక్!
అగ్ని-5
భారత్ తయారు చేసిన తొలి ఖండాంతర క్షిపణి. అయితే దీని ప్రాముఖ్యతకు
ఇదొక్కటే కారణం కాదు. భౌగోళికంగా మన దేశం ఉన్న ప్రాంతం... పాకిస్థాన్, చైనా
వంటి పొరుగు దేశాలతో ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుంటే ఈ ఖండాంతర క్షిపణి
ప్రయోగం విజయవంతం కావడం ఎంత కీలకమో అర్థమవుతుంది. దాయాది పాకిస్థాన్‌తో
వైరం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేకున్నా చాపకింద నీరులా
తన ప్రాభవాన్ని పెంచుకుంటున్న చైనా నుంచే మనకు ఎక్కువ ముప్పు ఉంటుందని
రక్షణ నిపుణుల అంచనా.
ఇందుకు తగ్గట్టుగానే ఈ దేశంతో మనకు
చాలాకాలంగా సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక గురువు దలైలామాకు మద్దతు
పలుకుతున్నామన్న కారణంగా ఇటీవల చైనా టిబెట్ ప్రాంతంలో అణు క్షిపణులను
మోహరించిందని ఇటీవలే వార్తలొచ్చాయి. ఇండొనేసియా ప్రాంతంలో చమురు బావులకు
సంబంధించి కూడా ఇరుదేశాలు ఇటీవల దౌత్యపరమైన మాటల యుద్ధానికి దిగిన విషయం
తెలిసిందే.
No comments:
Post a Comment