Monday, October 3, 2011

Dharmana Interview with ABN

 

జగన్ తీరు మొదటే నచ్చలేదు!
వైఎస్ పోయిన షాక్‌లో ఏమీ ఆలోచించలేకపోయాం
సంతకం చేయకపోతే 'ద్రోహు'ల్లా చూసే వాతావరణం

రోజువారీ నిర్ణయాలు తీసుకునే వ్యక్తే 'తప్పుల'కు బాధ్యుడు
ఆ తప్పులను దిద్దుకునే పనిలో ఉన్నాం
సీఎం కావాలని లేదు.. బొత్సతో నాది స్వభావ సమస్య
కన్నెధార వివాదం ఎర్రన్నాయుడు సృష్టి
'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో మంత్రి ధర్మాన
ఇంతకు ముందు ప్రభుత్వంలో యాక్టివ్‌గా ఉండేవారు. ఇపుడు ఒక రకంగా అజ్ఞాతంలో ఉన్నట్టున్నారు?
అది సరికాదు. ప్రతిపక్షంలో ఉండటం బలపడే ప్రక్రియ కాగా, అధికారంలో ఉండటం బలహీనపడే క్రమం. మంత్రిగా ఈ అవగాహన నాకు ఉంది.

తప్పిదాల్లో కేబినెట్ కూడా బాధ్యత వహించాలని జగన్ గ్రూపు అంటోంది కదా?
అది అవగాహనలేని మాట. కేబినెట్‌లో ప్రభుత్వ లక్ష్యాలకు సంబంధించి ఎవరూ వేలెత్తి చూపలేరు. అమలు చేసేటప్పుడు మాత్రమే పొరపాట్లు, తప్పులు కనిపిస్తాయి. ఏ రోజుకారోజు నిర్ణయాలు తీసుకునే వ్యక్తి దానికి బాధ్యుడవుతాడు. తప్పులు ఎవరి వల్ల జరిగినా పార్టీ దిద్దుకుంటుంది. అది నిరంతర ప్రక్రియ.

జగన్‌తో మీకు వ్యక్తిగతంగా నష్టం వచ్చింది కదా?
"వైఎస్‌ని నమ్మాను. అందుకే ఇపుడు జగన్ వెంట ఉన్నాను'' అని అన్నయ్య చెప్పారు. మాకు తలవంపులు తెచ్చింది. బహుశా రాజకీయాలను ఆకళింపు చేసుకోకపోవడంతో అలాంటి నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఆయన నిర్ణయం నన్ను ఏ రకంగానూ ప్రభావితం చేయదు (అంటూ ధర్మాన కళ్లనీళ్లు పెట్టుకున్నారు).

ఎల్లకాలం మీరే మంత్రిగా ఉంటే తనకు అవకాశం రాదనుకున్నారేమో?
మా అన్నయ్య ఎప్పుడూ అలా అనలేదు. ఆకాంక్ష ఉండడంలో తప్పులేదు. అందుకు మంచి మార్గం ఎంచుకోవాలి. పార్టీ కోసం జిల్లాలో గట్టిగా నిలబడ్డాం. ఆఖరుకు మావల్లే ఇలా జరిగేసరికి ఆవేదన చెందాను.

పల్లకి మోయాల్సి వస్తే జగన్ పల్లకి కన్నా చంద్రబాబు పల్లకే మేలని ఇటీవల ప్రకటించారు.
నేనన్న దాన్ని వక్రీకరించారు. నేనన్నది "జగన్ వెంట వెళ్లవలసి వస్తే రాజకీయాల నుంచే విరమించుకుంటా. చంద్రబాబుకు రెండుసార్లు సీఎంగా చేసిన అనుభం ఉంది. జగన్‌కు అదిలేదు'' అని మాత్రమే.

అనుభవంలేని జగన్‌ని సీఎం చేయాలని మీవంటి యోధులు సంతకాలు సేకరించడంలో ఔచిత్యమెంత?
ఊహించని విధంగా వైఎస్ చనిపోయారు. ఆ కుటుంబం నుంచి ఒకరిని పెట్టేస్తారంటే సరేనన్నాం. ఆయన సన్నిహితులు పేపర్లు తెచ్చి సంతకాలు చేయమన్నారు. నిజానికి, ఏదీ ఆలోచించే, చర్చిం చే వాతావరణం అప్పుడు లేదు. అయితే, హైకమాండ్ వేరేలా ఆలోచిస్తుందని తెలిసిన తరువాత, మళ్లీ ఆ ప్రసక్తే తీసుకురాలేదు.

అసలు మీ అందరితో కాగితాలపై సంతకాలు చేయించింది ఎవరు?
కొందరు యువ ఎమ్మెల్యేలు అడిగారు. సంతకం చేయకపోతే వైఎస్ కుటుంబానికి ద్రోహం చేసినట్టు భావించే పరిస్థితి ఉన్నది.

సీఎం ప్రతిపాదన వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర నుంచి బొత్స పేరు తప్ప మీ పేరు ఎందుకు రాదు?
ఎమ్మెల్యే కావాలనుకున్నా... అయ్యాను. మంత్రిని అవ్వాలనుకున్నా... ఆ పదవీ పొందాను. మంచిశాఖ నిర్వహించాలన్న కోరికా తీర్చుకున్నాను. కానీ, ఎప్పుడూ సీఎం కావాలనుకోలేదు.

కిరణ్ కేబినెట్‌లో మంచి శాఖ రాలేదని అసంతృప్తి చెందారుగా?
సీఎం ఆర్థిక శాఖ ఇస్తానన్నారు. నేను రెవెన్యూలోనే కొనసాగించమని కోరాను. కానీ, తరువాత పునరాలోచిస్తే సీఎం నిర్ణయమే సరైనదనిపించింది. ఎందుకంటే, రాష్ట్రంలో ఎవరూ నిర్వహించని విధంగా ఆరేళ్ల పాటు రెవెన్యూలో ఉన్నాను. ఏ పార్టీ ఇంత అవకాశం ఇస్తుంది?

వైఎస్ కేబినెట్‌లో ఉన్నంత పలుకుబడి కిరణ్ ప్రభుత్వంలోనూ ఉన్నదని భావిస్తున్నారా?
పలుకుబడి అనేది శాఖను బట్టి ఉంటుంది. కానీ, నన్ను ఎప్పుడూ సీఎం నిర్లక్ష్యం చేసింది లేదు (నిజం చెప్పండి?) ఇటీవల రూపాయి కిలో బియ్యం పథకం గురించి కూడా ముందుగా నాతోనే మాట్లాడారు.

బొత్సకు మీకు సఖ్యత లేదంటారు నిజమేనా?
ఇద్దరం ఒకే ఈడువాళ్లం కావడం, మా స్వభావాల్లో ఉన్న తేడా దీనికి కారణం. నేను నిదానంగా పోతాను. ఆయన దూకుడుగా ఉంటారు. అయినా, పీసీసీ పదవి చేపట్టినప్పుడు సమర్థించాను.

తెలంగాణ ఉద్యమం ఉద్రిక్తంగా మారే స్థితికి చేరింది. రాష్ట్రం రాష్ట్రంగానే ఉండే పరిస్థితి ఉన్నదా?
ఒక మంత్రిగా కేంద్రం నిర్ణయాన్ని శిరసావహిస్తా. ఉత్తరాంధ్ర నేతగా మాత్రం వెనకబాటుతనానికి విభజనే పరిష్కారమని భావించలేను. రాష్ట్రంలో భాగంగా ఉంచుతూనే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. దేశ ప్రయోజనాలూ దృష్టిలో ఉంచుకోవాలి. ఇన్ని పార్టీలు, ప్రాంతాలు, వాదాలుగా దేశం విడిపోయినప్పుడు ఒక ప్రాతిపదిక ఉండాలి.

మీ జీవిత లక్ష్యం ఏమిటి?
ఆరోగ్యం, పరిస్థితులు సహకరించినంత కాలం క్రియాశీల రాజకీయాల్లో ఉంటాను. ఆ తరువాత తప్పుకోవాల్సి వచ్చినా ఎలాంటి ఆవేదన అనుభవించకుండా ఉండాలనేది నా జీవిత లక్ష్యం.

సోంపేట కాల్పులు, కన్నెధార గ్రానైట్.. ఈ రెండు అంశాల్లో పదేపదే ఆత్మరక్షణలో పడుతున్నారు?
2003లో కేంద్రం మర్చంట్ పవర్ చట్టం తీసుకొచ్చింది. దానిలో భాగంగానే శ్రీకాకుళంలోని సోంపేటలో థర్మ ల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన వచ్చింది. దానితో నాకెలాంటి సంబంధం లేదు. కానీ, దాన్నంతా నాకు అంటగట్టారు. ఇక కన్నెధార కొండ విషయం... 1997లో దాన్ని లీజుకు తీసుకున్నాను. ఆ ఊరి సర్పంచ్ టీడీపీ నాయకుడు. ఎర్రన్నాయుడు దగ్గరుండి ఉద్యమం నడిపిస్తున్నారు. రెండుసార్లు అసెంబ్లీకి, లోక్‌సభకు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక ఆయన వివాదం లేవదీశారు. నిజానికి వివాదమెందుకు? వదిలేద్దామనుకున్నాను. కానీ, లేనిపోని ఆరోపణలున్న దరిమిలా నిర్దోషినని తేలేవరకు వదిలేది లేదన్నది మరో విషయం. ఎర్రన్నాయుడు, నేను కలిసి వ్యాపారం చేస్తున్నామన్న ప్రచారంలో నిజం లేదు.

No comments: